సిటీబ్యూరో: కరోనా వైరస్ కట్టడికి కీలక మార్గమైన లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై బుధవారం నుంచి కఠిన చర్యలు ప్రారంభించామని, కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన గురువారం వెల్లడించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ ఆడియో సందేశం విడుదల చేశారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖలతో పాటు ప్రజలు పాలుపంచుకుంటున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానుసారం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నగర పోలీసు విభాగం నిర్విరామంగా 24 గంటలూ పని చేస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటోందన్నారు. ప్రజల నుంచి పూర్తి సహకారం అందనిదే ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. నగరంలోని ప్రజల్లో 99 శాతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నా.. ఒక్క శాతం మాత్రం నిర్లక్ష్యం చేస్తూ రోడ్లపైకి వచ్చి అందరికీ ఇబ్బందికరంగా మారుతున్నారని కొత్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉల్లంఘిస్తే ఊర్కోం!